సాహిత్య ఉపన్యాస లహరి

తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
మొదటి భాగము - అజ్ఞాత, చైతన్య పర్వాలు

సీ.   నాగార్జునాద్రి నున్నని పాలరాళ్ళపై

సిరులు చిల్కిన తెల్గు శిల్ప లహరి!

ఏకశిలాపురీ ప్రాకారముల పైన

విశ్రమించిన తెల్గు విజయ లహరి!

విద్యానగర నందనోద్యాన వీధుల

కాంతులీనిన తెల్గు కావ్యలహరి!

త్యాగరాయల రాగ భావ డోలికలలో

కళలు చిందిన తెల్గు గాన లహరి!

గీ.    ఒక్కసారిగ, మరల నింకొక్క సారి

పొంగి పొరలును గాక త్రైలింగ జగతి

పసిడి పంటల తెల్గు సౌభాగ్య లక్ష్మి

నవ్వుకొనుగాక ఈ నవానందవేళ!!  ..(కరుణశ్రీ)

తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
రెండవ భాగము – భక్తి పర్వం-1

సీ.    కవిసార్వభౌముని కనకాభిషేకాన

పులకించి చిరునవ్వు చిలికె నాడు !

పగిలిన డిండిమ భట్టు డక్క ధ్వనుల్

వీనుల విందుగా వినియె నాడు !

శృంగార భక్తిని సీసాలలో నింపి

మోసులెత్తగ ఎంతొ మురిసె నాడు !

బంగారు జలతారు పల్లకీలో కుల్కి

దేశదేశాల యూరేగె నాడు !

గీ.    సొగసులూరంగ సిగ్గుతో వగలు పోయి

నాటి వైభవమది మది నాటియుండ

తీపి తలపుల కులికె నా తీరు నేడు

 మురిసెనీ తెలుగుసాహితీ ముద్దుగుమ్మ!!

తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
మూడవ భాగము – భక్తి పర్వం-2

సీ.    మందార మకరంద మాధురీ రస ఝరుల్

గలగలా పారు బంగారు నేల !

కుప్పించి యెగసిన కుంభినీధవు కాంతి

వెల్లువై విరబూసి వెలుగు నేల !

కమలాక్షు నర్చించు కరములు సరములై

 కైమోడ్పు సేసిన కవుల నేల !

వ్రేళ్ళసందుల కారు వెన్నమీగడలతో

పాడిపంటలు నిండ పండు నేల !

గీ.    ఇందుగలడందు లేడని ఎంతొ వెదకి

కడకు గోగోపకాంతల కడకు జేరి

అడిగెదనని వడిగజను యతివ సిరుల

వెలుగు జిలుగుల కురిపించు తెలుగు నేల!!


తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
నాలుగవ భాగము – వికాస పర్వం - 1

సీ.    తెలుగుభాషయె మంచి కలకండ, నే తెల్గు

వల్లభుండనియె  శ్రీవల్లభుడిట !

ఆచారమందముల్  అందలంబెక్కించి

మనువునే వెలయించు ఘనత యిచట !

భామ కోపము దీర్ప  పారిజాతము తెచ్చి

పెరటిలో నాటె  సర్వేశు డిచట !

కావ్యముల్ రచియించి, కవుల యూరేగించి

పల్లకీ మోసిరి ప్రభువులిచట !

గీ.    దిగ్గజములన్ని దిగివచ్చి నిగ్గు దీరి

భువనవిజయాన నిల్చి,  త్రిభువనములకు

తెలుగు కవితల జిలుగులు వెలుగు నింపి

తియ్యదనములు పంచిన  తెలుగు నేల !!

తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
ఐదవ భాగము – వికాస పర్వం -2

సీ.    అతులిత మాధురీ చతురత మహిమతో

పలుకుల  సుధలెన్నొ యొలికె నిచట !

అల్పులకైన  యనల్పమౌ  కరుణతో

ముక్తి నిచ్చెను  దైవశక్తి  యిచట !

శృంగార హాస్యముల్ పొంగారు భక్తితో

బంగారు కవితలుప్పొంగె  నిచట !

హరిహరులొక్కటే !  పరతత్వమొక్కటే !

యని చాటి చెప్పిన ఘనత యిచట !

గీ.    తెలుగు పలుకులు వీణపై  మెలకువలుగ

మీటి, మధువును పంచిన చోటు యిచట !

మాటలన్నను రతనాల మూటలవియె    

“తెలుగు లెస్స”న్న మాటలే వెలుగు నిచట !!

తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
ఆరవ భాగము – విలాస పర్వం

సీ.    కల్పనా శిల్పంబనల్పమై శృంగార

తల్పమౌ కవుల సంకల్పమిచట !

మల్లె మొల్లల మించి యుల్లమ్ము రంజింప

జేసిన కవితల చేవ యిచట !

పద్యంబు యనవద్య హృద్య సద్యశముగా

చవులూర జెప్పిన కవులు యిచట !

ఖడ్గమ్ముతో బాటు గంటంబు చేబూని

రసములే పంచిన రాజులిచట !

గీ.    చిలిపి వలపుల తలపులు తలుపు తట్టి

కులుకులొలుకుచు చిరునవ్వు చిలికె నిచట!

తెలుగు పలుకుల మొలకల చిలుక కొలికి

సరసమొలికించె నవరస భరితమిచట !!!


తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
ఏడవ భాగము - నైతిక  పర్వం

సీ.  అప్పిచ్చువాడెంతొ ఆప్తుడు, మాటకు

ప్రాణము సత్యమన్ ప్రాజ్ఞులిచట  !

చదువెంత యున్న రసజ్ఞత లేకున్న

చప్పిడి కూరన్న సరసులిచట !

మూర్ఖుని మెప్పింప ముమ్మూర్తులకు తరము

కాదని చెప్పిరి  కవులు యిచట !

కులమతంబులకన్న గుణశీలములె  ఎంతొ

యోగ్యమన్నట్టి సద్యోగులిచట !

గీ. నీతి  నిండిన మనిషి మనీషి యగును

నీతి వర్తనె హెచ్చించు జాతి ఘనత

యనుచు మంచిని పెంచిన  యనఘులైన

నీతిమంతులు తిరిగిన  నేల మనది !!

తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
ఎనిమిదవ భాగము - ఉద్యోగ పర్వం

సీ. రసికత్వముప్పొంగు రమణీయ కావ్యముల్

వెలయించు ఘనులంత మెలగిరిచట !

అవధానములు, నాటకములతో అద్భుత

ప్రతిభ చూపించిరి ప్రముఖు లిచట !

సాహిత్యమును సంఘ సంస్కరణమునకై

వినియోగ పరచిరి విబుధులిచట !

మూఢ దురాచారములనెత్తి చూపించి

మందలించిరి లోకబంధులిచట !

గీ. మంచి జాడలు, చెలువముల్ పెంచి, కూర్చి,

చిలుక పలుకుల కులుకులు చిలకరించి,

ఆనుపానులు వెలయించి, హాస్య లాస్య

ములను కురిపించి, ముద్దుల మూట గట్టు

కవిత లొలికించిరెందరో  కవులు యిచట !!

తెలుగు సాహిత్య ఉపన్యాస లహరి
 తొమ్మిదవ భాగం - స్వాతంత్య్ర పర్వం

సీ.    ఏ దేశమేగినా,  ఏ పీఠమెక్కినా,

తెలుగు కీర్తిని నిల్పు ధీరులిచట !

పాటలీపుత్రమ్ము కోటకొమ్మల మీద

తెల్గు జెండా వెల్గు  తెలిపిరిచట !

చాన,  కిన్నెరసాని,  శబరి,  సీతమ్మల

తెలుగమ్మలుగ తీర్చి దిద్దిరిచట !

అరసములవి కాని అతిరస కవితల

కురిపించి మురిపించె  సరసులిచట !

గీ.    భావ కవితలు, మరి దేశ భక్తి కవిత

రామ కతలును, విప్లవారావ కవిత

రాసులుగ పేర్చి, రత్న నీరాజనమిడు

తెలుగు వెలుగులు వెలసిన దివ్య భూమి !!